Event : Rosaiah gari humorous feedback for NTR.


Vibhag Title : Andhra Pradesh Vibhag
Event Date : 23-08-1984 07:33:00 am

దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నా తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:
ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడు రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.


రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహా సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని, నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.
మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.


ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.


పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.


అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.


ఎం. వెంకటేశ్వరరావు
జర్నలిస్ట్

Administration Office

World Arya vysya mahasabha,

2nd floor , Liberty plaza

Next building to MORE super market,

Near Mehta Nagar bus stop,

Vadagram street,

Choolaimedu,

Chennai 600094

Australia Office

World Arya vysya mahasabha 
44 Hermosa Drive, 
Tarneit, Vic 3029
Melbournne

Contact

  • info@mywam.org
  • Mr Narasimhan, +91 8939814427
  • Mr Ravi kumar, +91 9963128764
© 2024 World Arya Vysya Mahasabha. All Rights Reserved